‘‘కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్’’.. కష్టమంతా నీదే కదా అన్నయ్య!
ఓ వ్యక్తి కన్న కలలు..ఓ వ్యక్తి పడ్డ కష్టం..ఓ వ్యక్తి మానుకున్న నిద్రాహారాలు..కాలంతో పోటీపడి ముందుకు దూసుకెళ్లి..చివరకు ఆ వ్యక్తి గెలిచాడు.. గెలవడమే కాదు తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు. అంతే కాదు తన కుటుంబానికి నీడగా మహా వృక్షంలా నిలిచాడు. ఇప్పుడా కుటుంబం దక్షిణ భారతంలోనే ప్రముఖ కుటుంబంగా కీర్తించబడుతోంది. అదే మన ‘మెగా’ కుటుంబం..ఈ వృక్షానికి ఊపిరి అందించింది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం తెలుగు నాటనే కాదు దేశంలోనే బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీగా, సక్సెస్ ఫుల్ సినిమా స్టార్లతో అభిమానుల మన్ననలు అందుకుంటోంది. నాలుగు దశాబ్దాల కింద సాధారణ నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్..ఆ తర్వాత చిరంజీవిగా కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువుదీరాడు. కెరీర్ ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే తన అత్యద్భుత ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతే సినీ పరిశ్రమ గుర్తించింది. తర్వాత వరుస హిట్లతో బాక్సాఫీస్ కు బాద్ షా అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఆయన నీడలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్..వంటి సుమారు 10 మంది స్టార్లుగా ఎదిగారు. ఇక పవన్ గురించి చెప్పనక్కర్లేదు. పవన్ సినిమా నటుడిగానే కాదు పొలిటికల్ లోనూ పవర్ స్టార్ గా నిలిచి నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా ఎదిగారు. రాజకీయ రంగంలోనూ, సినీ రంగంలోనూ పవన్ రారాజుగా వెలుగొందుతున్నారు.
ఇక రామ్ చరణ్ విషయానికొస్తే మగధీర, రంగస్థలం, త్రిపుల్ ఆర్ చిత్రాలతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. రేపు రాబోయే గేమ్ ఛేంజర్ తో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. అలాగే మిగతా మెగా హీరోలు సైతం సినీ రంగంలో తమదైన ముద్రను వేసుకుని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతున్నారు. నిహరిక, సుస్మిత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. మెగా బిగ్ బ్రదర్ నాగబాబు సినీ నటుడిగానూ, జనసేన కీలక నేతగా త్వరలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతోతున్నారు.
ఇలా మెగా కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబమే అగ్రశ్రేణిలో నిలువడం చిరు కష్టానికి ప్రతిఫలమే అని చెప్పవచ్చు. అందుకే ఉత్తరాదిలో రాజ్ కపూర్ కుటుంబం ఎంతటి పేరు సంపాదించుకుందో..దక్షిణాదిన చిరు కుటుంబం అంతే స్థాయిలో మన్ననలు అందుకుంటోంది. దీనికి కారణం చిరంజీవి దశాబ్దాలుగా తన చెమటను చిందించికుంటూ కష్టపడడమే. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి మెగాస్టార్ ఎదగడమే కాదు..తెలుగు సినీ పరిశ్రమలో మేరునగధీరుడిగా కీర్తించబడుతున్నారు.