32 సంవత్సరాల ముఠామేస్త్రీ.. మంత్రిగా కుర్చీ మడతేట్టిసిన మెగాస్టార్!

muta mestri megastar chiranjeevi

32 సంవత్సరాల ముఠామేస్త్రీ.. మంత్రిగా కుర్చీ మడతేట్టిసిన మెగాస్టార్!

‘‘ఈ పేటకు నేనే మేస్త్రీని..నిరుపేదల పాలిటి పెన్నిధి..ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా..’’ అంటూ ఈ పాటను కొన్ని వందల సార్లు విన్నాం. పెళ్లిల బరాత్ లో, స్కూల్ ప్రోగ్రామ్స్ లో తెగ డ్యాన్సులు వేసేశాం. చిరు డ్యాన్స్ కెపాసిటీ ఈ పాట చూస్తే అర్థమవుతుంది. ఊర మాస్ పాత్రలో మెగాస్టార్ ఇరగదీశాడు. ఈ మూవీలో పాటలు, డ్యాన్సులు, స్టైలిష్ ఫైట్లు, కామెడీ, ఎమోషనల్, రొమాన్స్, మంచి కథ, కథనం..ఇలా ఒకటేమిటి ఈ మూవీ ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు విందు భోజనం లాంటిది. అందుకే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు యూట్యూబ్ లో, షార్ట్స్ లో తిరుగుతూనే ఉన్నాయి. పక్కా మాస్ ఓరియంటెడ్ సినిమాతో కావడం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రావడం ఈ సినిమా ప్రత్యేకత.

ఈ సినిమాకు ఎవరెవరు పనిచేశారు..

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, రోజా, మీనా, శరత్ సక్సెనా, మన్సూర్ అలీఖాన్, బ్రహ్మనందం, కోట, అల్లు రామలింగయ్య, గుమ్మడి

రచన: పరుచూరి బ్రదర్స్
నిర్మాత: కేసీ శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి
ఫొటోగ్రఫీ: ఎస్. గోపాల్ రెడ్డి
సంగీతం: రాజ్ కోటి
దర్శకుడు : ఎ. కోదండరామిరెడ్డి
విడుదల తేదీ: 1993 జనవరి 17

ఇంతకీ కథేంటి?

ఇందులో బోసు పాత్రలో మెగాస్టార్ జీవించేశారు. బోసు ఓ కూరగాయల మార్కెట్ కూలీల మేస్త్రీగా పనిచేస్తుంటాడు. అక్కడి కూలీలకు అన్యాయం జరుగకుండా చూస్తుంటాడు. బోసుకు దేశభక్తి ఎక్కువ. స్వాతంత్ర్య సమరయోధుడైన అల్లు రామలింగయ్య ఎంతో గౌరవిస్తూ.. ఆయన బాటలో నడుస్తుంటాడు. ఆ పట్టణంలో ఆత్మా(శరత్ సక్సేనా) పెద్ద నాయకుడు. చట్టవ్యతిరేక పనులు చేస్తుంటాడు. అతడికి వ్యతిరేకంగా బోసు పనిచేస్తుంటాడు. బోసు పనిచేసే మార్కెట్ స్థలంపై కన్నుపడ్డ ఆత్మాతో బోసు పోరాటం చేస్తుంటాడు. ఈక్రమంలోనే బోసు దేశభక్తిని, మంచితనాన్ని, పేదలకు మంచి చేయాలన్న తపన ఉన్నవాడిగా గుర్తించిన ముఖ్యమంత్రి గుమ్మడి.. బోసును ఎమ్మెల్యేగా పోటీ చేయమంటాడు. దీనికి ముందుగా ఒప్పుకోని బోసు ఆ తర్వాత పరిణామాల వల్ల ఒప్పుకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఆ తర్వాత మంత్రి పదవిని చేపడుతాడు. మంత్రిగా బోసు అన్యాయాలను ఎదుర్కోవడంతో పాటు అధికారుల్లో అవినీతిని అరికట్టుతాడు. అసలు సిసలైన లీడర్ ఎలా ఉండాలో చూపిస్తాడు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తుంటాడు. ఆ తర్వాత ఆత్మా చేసిన కుట్రల వల్ల తన చెల్లిని పోగొట్టుకుంటాడు. మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. చివరకు ఆత్మాను అంతమొందించడమే సినిమా ప్రధాన కథ.

ఎవరెవరు ఎలా చేశారు..?

బోసుకు మార్కెట్ లో ప్రేయసిగా మీనా నటించింది. వీరిద్దరూ బ్రహ్మనందం తదితరులతో చేసే కామెడీ ఆకట్టుకుంది. మీనాతో చిరు చేసే కామెడీ మాములుగా ఉండదు. మార్కెట్ లో పరుచూరి బ్రదర్స్ తో అటాచ్ మెంట్ బాగుంటుంది. ఇక మంత్రిగా అయిన తర్వాత రోజా పీఏగా వస్తుంది. రోజా బోసును వలలో వేసుకోకుండా చూసేందుకు మీనా, బ్రహ్మనందం ఆడిన డ్రామా బాగుంటుంది. సిక్స్ దాటితే సెక్స్ అంటూ బ్రహ్మి చెప్పిన మాటలతో రోజా భయపడిపోతుంటుంది..ఇలా కొద్దిసేపు ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇక మిగిలిన పాత్రల్లో అందరూ బాగా చేశారు.

టెక్నిషియన్ల పనితీరు..

ఈ సినిమాకు ప్రధాన బలం కథ, మాటలు, సంగీతం. పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అద్భుతం. అప్పట్లోనే పొలిటికల్ డైలాగ్ లు ఉర్రూతలూగించాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం బాగానే జరిగింది. చివర్లో కూడా ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చి అవినీతి చెత్తను ఊడ్చేస్తాననే డైలాగ్ కూడా వదిలారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి ప్రజల వద్దకే పాలన అన్న కాన్సెప్ట్ ను ఈ సినిమాలో మొదటిసారిగా వాడడం గమనార్హం. ఆ తర్వాతనే ఒకే ఒక్కడు లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ మూవీలో పాటలు అణిముత్యాలే అని చెప్పాలి. చిరు అంటేనే పూనకం వచ్చే రాజ్ కోటి ద్వయానికి ఈ సినిమా మంచిపేరు తెచ్చింది. ముఖ్యంగా ఈ పేటకు నేనే మేస్త్రీ పాట వేరే లెవల్. చిరంజీవి తన స్టైలిష్, మాసివ్ డ్యాన్సింగ్ అద్దరగొట్టారు. ఈ పాటలో సిల్క్ స్మిత చిరుతో ఆడిపాడుతుంది. ఈ పాటలోనే లారెన్స్ ఎక్కడో మూలన కనపడుతాడు. ఈ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. ఈ సినిమా టైంలోనే సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన లారెన్స్..ఆ తర్వాత హిట్లర్ సినిమాకు అబ్బిబ్బీ..పాటకు కొరియోగ్రాఫర్ గా పనిచేయడం గమనార్హం. ఈ మూవీలో అంజనీపుత్రుడా..వీరాధివీరుడా; జోరుగున్నది..; గోడి గడియారంలో.. అనే పాటలు ప్రేక్షకులను ఇప్పటికీ మరిచిపోలేరు. మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ ఆల్బమ్.

చిరు పాత్ర అదరహో..

90ల్లో చిరు శకం నడుస్తోంది. ఆ టైంలో వచ్చిన ఈ సినిమా దుమ్ముదులిపేసింది. మేస్త్రీగా చిరు లుక్ మాములుగా ఉండదు. మేస్త్రీగా, ప్రజాప్రతినిధిగా చిరు మార్క్ నటనతో, ఈజ్ తో, టైమింగ్ తో, డైలాగులతో అలరిస్తూ వన్ మ్యాన్ షో చేసేస్తాడు. ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా చిరు చేసిన నటనతో అప్పట్లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి అలా చేస్తే బాగుండు అని తెలుగు ప్రజలు అనుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు చిరంజీవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ యాక్టర్ గా నాలుగో సారి అవార్డు అందుకోవడం విశేషం.

కొసమెరుపు..

ఈ సినిమాలో చిరు నటన ఇప్పటి హీరోలకు ఓ డిక్షనరీ అనుకోవాలి. మాంచి మాస్ పాత్రలోనూ, అటు పొలిటికల్ లీడర్ గానూ చిరు నటన చూస్తే వారికి ఎలా నటించాలో అర్థమవుతుంది. అన్నిరకాల షేడ్స్ ను చిరులా చేయడం అప్పటి తరం హీరోలకే కాదు ఇప్పటి తరం హీరోల వల్ల కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే అది ఒక్క మెగాస్టార్ కే సాధ్యం. ఈ సినిమాను ఇప్పుడు చూసిన ఎంతో ఫ్రెష్ గా కొత్త మూవీలాగే ఉంటుంది.. వీలుంటే ఒక్క సారి చూసేయ్యండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top